పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0042-3 ముఖారి సంపుటం: 06-003

పల్లవి:

రమణి నేర్పు నేరములాయె
జమళివిధుల సరసపు విభుఁడా

చ. 1:

తెఱవకు నంపిన తెల్లని కలువలు
మఱపున కెందామర లాయె
నెఱుఁగము నీవిపు డింతచేతువని
కఱతలకలికివి గా విభుఁడా

చ. 2:

మగువకు నంపిన మకరంద మిచ్చటి
జిగి దొలంకేటి చిఱుచేఁదాయె
అగు నీ యెకసక్యమ్ముల మాటల
వగ నెఱజాణండవా విభుఁడా

చ. 3:

చెంతల ముత్యపుం జిప్పల తోయము
లంతలోనె ముత్యములాయె
సంతత కరుణా జలనిధి లక్ష్మీ
కాంతుఁడవఁట వేంకట విభుఁడా