పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0042-2 భైరవి సంపుటం: 06-002

పల్లవి:

ప్రాయంపు మదములే పరిణామము మతిఁ
బాయని రమణికి నీఫై నెంతవలపో

చ. 1:

తుమ్మిపూవుఁగొలనిలో తరుణులుందాము మిండ
తుమ్మెద లీఁదులాడంగ దొంగి చూచి
కొమ్మ నినుఁ గూడి కేళాకూళితోఁ గస్తూరినీట
నిమ్ముల నోలలాడిన దెటువంటి వలపో

చ. 2:

కొదమమావిపై గండుఁగోవిల లేఁజిగురాకు
ముదిత కందీఁగా ప్రేమమునఁదాఁజూచి
అదివొ యుప్పరిగెపై నాకుమడిచి నీ వీఁగా
వదనాన నందుకొనె వడి నెంత వలపో

చ. 3:

నెయ్యంపుఁ జకోరము వెన్నెల రస మింతినోర
నొయ్యనె కుమ్మరించంగ నువిదచూచి
కయ్యంపుంగూటమిని వేంకటేశుండ తమ్మరస
మియ్యంగఁ జొక్కితివి నీ విపుడెంతవలపో?