పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0051-2 శంకరాభరణం సంపుటం: 06-056

పల్లవి:

గుఱు తెఱిఁగిన దొంగ కూగూగు వీఁడె
గుడిలోనె దాఁగేని కూగూగు

చ. 1:

నెలఁతల దోఁచేని నీళ్లాడఁగానె
కొలని దరిని దొంగ కూగూగు
బలువైనవుట్ల పాలారగించేని
కొలఁది మీఱిన దొంగ కూగూగు

చ. 2:

చల్ల లమ్మంగ చనుకట్టు దొడికేని
గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక యిందరి పాలిండ్లు
కొల్లలాడిన దొంగ కూగూగు

చ. 3:

తావుకొన్న దొంగఁ దగిలి పట్టుండిదె
గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చెలువుండొ యేమొ
కోవిదుఁడగు దొంగ కూగూగూ