పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0048-6 సామంతం సంపుటం: 06-042

పల్లవి:

ఎంత మేలు చేసినదో యేమిచెప్ప చిత్త
మంతయు నీకిచ్చిన యొయ్యారి యెవ్వతెరా

చ. 1:

దాడింబ పువ్వలవన్నె తళుకుఁబయ్యెద కొంగు
వేడుకతో వల్లెవాటు వేశి
గోడనిక్కి చూచి తనకొప్పు చెంగలువబంతి
నోడక వేసినయట్టి యొరపరెవ్వతెరా

చ. 2:

కంకణాల మెఱఁగుల కరము లొయ్యన యిరు
వంకల చెలలుమీఁద వైచి
కొంకక తమలపాకు కొనవంక గఱచి నీ
వంక చూచి సన్న సేసె వనిత యెవ్వతెరా

చ. 3:

పిక్కటిల్లునట్టి తన బిగువుఁజన్నుల కాంతి
వెక్కసమై యిరువంక వెడల
యెక్కువతోఁ దిరువేంకటేశుండ నిన్నుఁ గూడి
చెక్కునొక్కి కౌఁగిలించ్చె చిత్తణి యెవ్వతెరా

రేకు: 0049-1 గౌళ సంపుటం: 06-043

పల్లవి:

అల్లవాఁడే వాఁడల్లవాఁడే
యెల్ల లోకములకుఁ దానేలికైనవాఁడు

చ. 1:

దొడ్డమేఁక పొలగూడు దోమటి దొడికినాఁడు
గడ్డువయసగు బిడ్డగన్నవాఁడు
నడ్డి ముక్కుతోడ వెఱ్ఱి నవ్వులు నవ్వినవాఁడు
అడ్డపాపఁడై యున్న ఆకుమీఁదివాఁడు

చ. 2:

ఆలి యిల్లు బొడ్డుతోడ నంటఁగట్టుకొన్నవాఁడు
కోలలేక లోకమెల్లఁ గొలిచినాఁడు
కాలువగా మింటి నీరు కాలఁదన్ని తీసినాఁడు
నేలకింది పరపుపై నెలకొన్నవాఁడు

చ. 3:

మించుల మించుల వన్నె మెకము నేసినవాఁడు
దంచేటి కైదువచేఁదనరువాఁడు
కంచముగా గొల్లవారి కడవలపాలెల్ల
వంచుకొని దోసిట వారవట్టువాఁడు

చ. 4:

పోటుమీరిన యసురపురము లిన్నియుఁ జొచ్చి
వీటిబుచ్చి దుమ్ములుగా వేసినవాఁడు
బూటకపు సురలతోఁ బున్నమ కప్పురమున
కూటువగాఁ జాపకూడు గుడిచినవాఁడు

చ. 5:

అల్లిందామరల పొందులైన కన్నులవాఁడు
తల్లిఁ గూఁతుఁ గౌఁగిటఁ దగిలినాఁడు
చల్లనైన వేంకట శైలముపై నున్న
నల్లని మేనివాఁడు నవ్వుమోమువాఁడు