పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0049-2 సామంతం సంపుటం: 06-044

పల్లవి:

మనసునఁ బొడమిన కోపము మనసునకంటెనుఘనమఁట
మనసిజుఁడుద్చోధకుఁడఁట మాటల పని యేల

చ. 1:

దవ్వుల కొండల పవనుఁడు తనుతాప ప్రేరకుఁడట
నవ్వులఁ బుట్టిన చూపులు నాటెడి యమ్ములఁటా
పువ్వులు సోఁకిన యంతనే పొక్కెడునఁట దేహంబులు
యెవ్వఁడెఱుంగును ఈవిధమేమని చెప్పుదమూ

చ. 2:

చక్కఁదనములఁట గుండెలు జల్లనం జేయఁగలవఁట
మక్కువలఁట దేహంబులు మరవఁగఁ జేయునఁటా
కిక్కిఱిసిన తమకంబులు క్రిందును మీఁదు నెఱుఁగవఁట
ఱెక్కల పులుగుల పలుకులు ఱేఁపెడువుండ్లఁటా

చ. 3:

సంతసములుఁ జతురతలును సౌభాగ్యవిలాసములును
మంతనములు మోహంబులు మందులసంచులటా
యింతటికిని తగుమూలం బీవేంకటవిభుఁడట
యింతి తలంపునఁ గలుగుట లిఁక నెన్నఁగనేలా