పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0048-5 దేసాక్షి సంపుటం: 06-041

పల్లవి:

ఇచ్చకపు మాటాలా యేతులాఁడా కడు
పచ్చిదేరే మే నెల్లఁబట్టకు నన్నింకనూ

చ. 1:

దండగాఁగ మెడఁగుచ్చి తగిలించుకొంటివి
అండనుండే వారు చాల కాపె నొకతె
వెండియు నంతటఁ బోక వేగునంతకు నాడనే
పండి వచ్చితివి చాలు పట్టకు నన్నింకను

చ. 2:

పొద్దు వొద్దునకు తలఁబూజించుకొంటివి
వద్దనక యాకెమీఁది వాఁడుఁబువ్వులూ
ముద్దు సేసి యాకె తావి ముక్కు వాయ నియ్యనీ
పద్దుల మాటలె చాలు పట్టకు నన్నింకను

చ. 3:

చిందనీక యాకె మేని చిఱుఁజెమ టెల్లను
పొందుగ నామీఁదం దెచ్చి వూసినాఁడవూ
కందుఁగాక మేని వేంకటగిరి విభుఁడ నీ
పందెపుఁ గూటమే చాలు పట్టకు నన్నింకను