పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0048-4 సామంతం సంపుటం: 06-040

పల్లవి:

విట్టలయ్య వీధికేఁగి వేగవచ్చెవో
కట్టుఁగాలు వలసొంపు గందువు గాని

చ. 1:

దూపిలి నొచ్చితివి తొయ్యలి మెచ్చితివి
భూపతి చెరువు దాఁకాఁ బోయిరా రాధా
యేపు మీర నీఁదులాడి యింతుల నింద్దరిఁ గూడి
వైపుగాఁగ మాపటెంత వత్తువు గాని

చ. 2:

యెండ దాఁకితివి కడు నిచ్చల రచ్చలు సేసి
కొండచరిఁబొలమోరఁ గూరుచుంటివో
కొండలెక్కి కడునిక్కి కూరుముల నాకు దక్కి
బొండుమల్లెల తోఁటకుఁ బోదువుగాని

చ. 3:

విజయనగరములో వీధుల వీధుల వెంట
భుజమురికలతోడఁ బొద్దువుచ్చెవో
త్రిజగములు నేలిన తిరువేంకటేశుండ
భజన నిలిచితి భూపతి చెరువుకాడను