పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0048-3 లలిత సంపుటం: 06-039

పల్లవి:

బాల బొమ్మచారివి పట్టపువికారివి
ఓలినీ వెవ్వరిఁగన్నా నూరకుండేవా

చ. 1:

దొంగిలి వెన్నలుఁ బాలు దొడికేటినీచేయి
ముంగిట నిధానమున్న మోసపోయీనా
చెంగట నిన్నెవ్వరైనాఁ జెనకి నవ్విననూ
అంగవించి కొనగోర నంటకుండేవా

చ. 2:

సిగ్గరి గొల్లెతలపైఁ జిమ్మెడి నీ చూపు
బగ్గన నిచ్చన చోట బారవేసేవా
దగ్గరి నిన్నెవ్వరైనాఁ దగులనాడిననూ
ఎగ్గెఱుఁగ కెందుకైనా నేఁగకుండేవా

చ. 3:

కొమ్మల చీరలు దీసుకొని యున్న నీవూ
దిమ్మరి చేఁతల నిట్టి దిగ దోసేవా
క్రమ్మర నావలెనె వేంకటగిరి విభుండా
బిమ్మిటిగాఁ గూడి ప్రేమ పెంచకుండేవా