పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0047-3 సామంతం సంపుటం: 06-033

పల్లవి:

గుబ్బచన్నుఁగవ లెల్ల గుబ్బలి కొండలు మంచి
గబ్బితనములె కన్నుగానని వలపులు

చ. 1:

తేనియల చెలమలు తియ్యనిమోవులు మించు
లైనయమృతపుఁబిళ్ల లాననపద్మములు
మానైన చక్కెర బొమ్మలు మేనుదీగెలు
లేనగవు మెఱుఁగులు లేఁతవెన్నెలలు

చ. 2:

సానఁ బట్టిన తూపులు చక్కని చూపులు మంచి
వేనలి కమ్మని తావులానిన తుమ్మెదలు
చేనిపంటల కొల్చులు చెప్పరాని చెయ్దులు
మానమానని చింతలు మాటలలో మూఁటలు

చ. 3:

వెలలేని రచనలు వేడుక చేఁతలు వట్టి
పొలయలుకలు ప్రొద్దువోని బూటకములు
ఎలమితోఁ దిరువేంక‌టేశుని బొందినయట్టి
చెలియ గర్వము నేఁడు చెప్పఁజూపఁగతులు