పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0047-2 శ్రీరాగం సంపుటం: 06-032

పల్లవి:

వేడుక కాఁడవై విడివడి తిరిగేవు తుమ్మెదరో
చూడఁ జూడఁగఁదొంటి చూపు దప్పకువయ్య తుమ్మెదరో

చ. 1:

తలఁపుదామరలోన తావై యుండుదు నీవు తుమ్మెదరో
తలఁపఁగ నీవె తలఁప వైతివి మమ్ముఁదుమ్మెదరో
పొలయఁ గమ్మని తావి పొందునఁ దిరిగేవు తుమ్మెదరో
పొలసినీ తిరిగేటి పొందులెఱుంగుదుము తుమ్మెదరో

చ. 2:

పచ్చని విలుకాని బంటవైతివిగద తుమ్మెదరో
మచ్చిక తలఁపులు మనలోనె సరివోలు తుమ్మెదరో
అచ్చపుదీమస మందరి కెక్కడిదయ్య తుమ్మెదరో
చిచ్చువటి వెన్నెల చెలిమి సేయకువయ్య తుమ్మెదరో

చ. 3:

తిరువేంకటాద్రిపైఁ దిరమై నిలిచినట్టి తుమ్మెదరో
పరమయోగుల పూలఁ బరిమళములు గొన్న తుమ్మెదరో
కరుణించి మామీఁదఁగలిగిన యీప్రేమ తుమ్మెదరో
ఇరవాయె నిటువలె నెలసివుండంగదవె తుమ్మెదరో