పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0047-1 నాదనామక్రియ సంపుటం: 06-031

పల్లవి:

ఏగతి నోఁచెనో యిందువదన యీ
బాగులు ఖేదముఁ బాపెడిని

చ. 1:

తొలఁకెడి జలములతోడికన్నుఁగవ
తలఁచి డెందము తలఁకీని
అలయుచుఁ జలితో నాడినమాటలు
పలికిన నామది భ్రమసీని

చ. 2:

తొడరిన చెమటలఁ దోఁగిన పయ్యెద
పొడగని దేహము పొగిలీని
ఉడికెటి వ్రేఁకపుటూర్పుల వేఁడికి
నుడిగిన నాలుక నొగిలీని

చ. 3:

కదిసిన తిరువేంకటపతి చేఁతలు
సుదతి విలాసము చూపెడిని
వదనము తావికి వలగొనుతేఁటుల
సదమద మగు రుతి చాటీని