పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0046-5 ముఖారి సంపుటం: 06-029

పల్లవి:

నీకుఁ గాంతకుఁ దెలు నీవెఱుఁగు దది యెఱుఁగు
నీకడాకడవార లెవ్వ రెఱుఁగుదురు

చ. 1:

తప్పకిటు నినుఁ జూచి తరుణి చనుఁగవమీఁదఁ
గప్పిన చెఱఁగువదలఁ గప్పనేఁటికిరా
చెప్పఁ జాలక పొలిఁతి చెలికరముఁదనకరము
నప్పళించుచు గోర నదిమె నేఁటికిరా

చ. 2:

కాంత నీ చిరునవ్వు కనుఁగొనలఁ గని మనసు
వంత దెలుపక మొగము వంచ నేఁటికిరా
ఇంతి వేఱొకతె నిను నెలయించఁగాఁ జూచి
యంతలో నవలిమొగ మాయె నేఁటికిరా

చ. 3:

ఎలమిఁగైకొని వేంకటేశ! నీవాతరుణి
నలమి కౌఁగిటఁ జేర్ప నసమబాణములు
జలజాయతాక్షి విచ్చనవిడిని తను మఱచి
యలర నేర్చులు నెఱపదాయె నేఁటికిరా