పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0046-4 మెంచబౌళి సంపుటం: 06-028

పల్లవి:

నీకు నేల తమకము నీకు అలపు నేఁడు
నీకు వాఁడు మోహించి నీలోనె యుండఁగా

చ. 1:

తొడవుగాఁ గమ్మని కస్తురిఁ బొట్టుగాఁబెట్టి
జెడలల్లి జవ్వాది శిరసుపై నంటి
విడువని విరహపు వెచ్చ మేన దైవాఱ
నిడువాలుఁ గనుదోయి నీరు నించ నేఁటికి

చ. 2:

కొత్త ముత్యపు సరుల కుచ్చులు వీపున వ్రేల
నొత్తిలి చెక్కునఁ గర మూఁది మోమువంచి
లత్తుక మోవి గదల లలన నీచిన్నయెలుఁ
గెత్తి ప్రేమ దైవాఱ నెవ్వరిఁ బాడెదవే

చ. 3:

కొండలరాయుఁడు వాఁడు కోనేటితిమ్మఁడు నీ
నిండిన చిత్తములోన నీవు దానై యుండఁగాఁ
గొండగొన్న సుఖమెల్లఁ గొల్లలాడుదువుగాక
బొండుమల్లె పానుపుపై బొరలఁగ నేఁటికే