పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0046-2 లలిత సంపుటం: 06-026

పల్లవి:

ఎందరి వలపిఁచెనో యంటనింట
చిందుల పాటలు వింట సిరులు చేకొంట

చ. 1:

తుంగభద్ర యేటికాడ తోరమైనకొండనీడ
రంగుమీరి పైఁడి గోడ రాతిమేడ
అంగడి నున్నాఁడు చూడ నదివో పెడతల
చుంగుల పించెపు గూడ చుట్టు బాగతోడ

చ. 2:

పండరంగినుండి వచ్చి పామరుల నెల్ల మెచ్చి
యెండలేని నీడలోన యెచ్చి యెచ్చి
వెండి బైఁడిఁదడంబడ విభవాలఁ బ్రొద్దు వుచ్చి
కొండనుచు వరములు కోరిక లిచ్చి

చ. 3:

చక్కని యావిట్ఠలుండై జవ్వనానఁ జెలువుండై
ప్రక్క నున్న సతి తోడఁ బ్రబలుండై
మక్కువ వేంకటగిరి మాయధారి దేవుండై
యెక్కడా నెదురులేక యీడ నున్నాఁడిడివో