పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0046-1 భూపాళం సంపుటం: 06-025

పల్లవి:

విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర ఫైకెత్తవేలయ్యా

చ. 1:

తెల్లవాఱె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదివో వారె
చల్లని తమ్మిరేకుల సారస్యపుఁ గన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

చ. 2:

గరుడకిన్నరయక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతతాళాల
పరిపరివిధములం బాడేరు రాగాల నిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

చ. 3:

పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజ భవాదులు నీ పాదాలు చేరి
అంకెల నున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుఁడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా