పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0045-4 శుద్దవసంతం సంపుటం: 06-022

పల్లవి:

ఎంతమాయల వాఁడెంచి చూడఁగ వీఁడు
ఇంతి యీతని రూప మెవ్వరెఱుఁగుదురు

చ. 1:

తెలుపు జలములలోన తెప్పవలెఁదేలీనే
తలఁకి పాతాళమున దాఁగియుండీనే
కెలసి తన కన్నులను కెంపువగాఁ జేసీనే
నెలఁత భీకరముగా నేఁడు నవ్వీనే

చ. 2:

ఒరపుగా భూదాన మొకరిఁదా నడిగీనే
తరుణి భూమొక్కరికి ధారవోసీనే
మరలి పద్మజుని మనుమనినైనఁ జంపీనే
పరచుఁదనమున వృధా పాలుమాలీనే

చ. 3:

పలుమారు తన సిగ్గు బయటఁ బడవేసీనే
కలికితనమునఁ దాను గడవఁబాసీనే
వెలఁది వేంకటగిరి విభుఁడు నా కౌఁగిట
తొలఁగక చెమటలఁ దొప్పఁదోఁచీనే