పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0045-5 సౌరాష్ట్రం సంపుటం: 06-023

పల్లవి:

ఎట్టుగడియించే నమ్మ యీవలపు
పుట్టించి నటువంటి పూఁటకాఁపు మరుండు

చ. 1:

తడఁబాటు నాలికకు తలఁకు మానంబునకు
నొడఁబాటు మఱపులకు నుదుటుఁ దలఁపులకు
కడువేడుకలు కోరికలకు భయ మాసలకు
బెడిదంపుఁ గోపంబు బిత్తరి చూపులకు

చ. 2:

అతిముదము చింతకును అలపు గర్వంబునకు
మితిలేని తాపంబు మెత్తని తనువునకు
రతి గమ్మచెమటలకు రచన విరహంబునకు
ధృతి లేమి మనసునకు గతి గమనమునకు

చ. 3:

కురులు నెన్నుదుటికిని గుఱుతు లధరంబునకు
మురిపెంపుఁ జిఱునగవు ముద్దుమోమునకుఁ
దిరమైన వేడుకలు తిరువేంకటేశునకుఁ
బరిణాపు మాటలివి పడఁతు లిందఱికి