పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0044-6 ఆహిరి సంపుటం: 06-018

పల్లవి:

విన్నవించఁగరాదు విచ్చేయు మనరాదు
అన్ని విన్నపములు అవియె యివియు

చ. 1:

తూఁగు మంచముమీఁద తొయ్యలి పవ్వళించి
వ్రేఁగైన తురు మరవీడఁగాను
కాఁగిన మేనితో కన్నుఁ దమ్ముల నీ
రాఁగియాడిన మాట లవియె యివియు

చ. 2:

గొప్పలయిన చనుఁగొండలా పైపైనె
చిప్పిలు చెమ్మట చిందఁగాను
చెప్పక చెప్పుచు చెలి తడంబాటుతో
నప్పుడాడిన మాట లవియె యివియు

చ. 3:

నీవి చెఱఁగు జారి నెలఁత నీ కౌఁగిట
కావిక న్నులతోడఁ గరఁగుచును
శ్రీ వేంకటేశ్వర చెలరేఁగి నివ్వెర
గై వెనుకఁదలంచె నవియె యివియు