పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0044-5 సామంతం సంపుటం: 06-017

పల్లవి:

వలదన నొరులకు వసమటవే
తలఁచినట్ల నిది దైవమే చేసె

చ. 1:

తరుణి కుచములను తామర మొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునఁ బతి నఖ చంద్రశకలములు
దరులఁ గలుగ నివి దైవమె చేసె

చ. 2:

పొలిఁతి వదనమును పున్నమ చంద్రుఁడు
బలిమి నెగయునని భయమునను
మెలఁత చికుర ధమ్మిల్లపు రాహువు
తలఁ జెదరఁగ నిది దైవమే సేసె

చ. 3:

వనితకు వాడునొ వలపు తాపమున
తనులతికయనుచుఁ దమకమున
ఘన వేంకటపతి కౌఁగిట చెమటలఁ
దనివి దీర్చనిది ధైవమె సేసె