పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0044-4 కాంబోది సంపుటం: 06-016

పల్లవి:

వలపుల దాడి వచ్చె వనితలారా మరుం
డెలగో లేయంగఁ జొచ్చె నేలాగే

చ. 1:

తూరుపునం బొడిచెఁ జందురుఁడు మిన్నుల మోవ
పాఱుతెంచె విరహుల బందికాఁడు
గోరపు వెన్నెల వెల్లి గొని మీఁదమీఁద నిప్పు
లేఱై పారఁగఁజొచ్చె నెందు చొత్తమే

చ. 2:

చందనపుఁ గొండ వంక చల్లగాలి తుదముట్టి
ముందు ముందె కదిసె దుమ్ములు లేవఁగా
మందమై పన్నీటి సోన మందు చల్లె నమ్ములై
యెందు చూచినఁ దానె యేమి సేతమె

చ. 3:

క్రొచ్చి పారె గుబ్బచన్నుఁ గొండల చెమ్మటనీరు
రొచ్చుగం గరి దరులు జారఁగా
పచ్చిగా వేంకటగిరి పతి యింతిఁ గూడఁగాను
ఇచ్చకాలె గనమాయె నింక నేఁటిదే