పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0045-1 ఆహిరి సంపుటం: 06-019

పల్లవి:

సుదతి నీ కింతవంటా చూచెఁగాని
యెదనున్న నీతలం పెఱుఁగలేదాయె

చ. 1:

తగులనాడితి వంటా తమక మందితి వంటా
నగితివంటా నింతి నమ్మెఁ గాని
జగడించి వేఱొక్క సతికి మోహము సేసి
తెగి తన్ను విడిచేది తలియలేదాయె

చ. 2:

కలలో వచ్చితివంటా కన్నుల మొక్కితివంటా
వెలఁది పువ్వుల బంతి వేసెఁ గాని
కలికి చేఁతల వట్టికాఁకలు వొడమించి
తలవంపిఁచేవని తలఁచలేదాయె

చ. 3:

వేరుసేయ వంటా వేంకటపతి వంటా
కూరిమి గలవంటాఁ గూడెఁ గాని
నేరుపు మెరయించి నెలఁత నీ వెంతేని
ఊరడించినదాఁక నుండలేదాయె