పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0044-1 బౌళి సంపుటం: 06-013

పల్లవి:

కనుమూసెఁగదె దీని గరువంపుఁ దెలివి
చనుదోయి పైకొంగు జారిన నెఱుఁగదు

చ. 1:

తలకెక్కెఁగదె దీని తనువికారములు
పొలుపైన నెరులు కొప్పున జారెను
చలి ముంచెఁగదె దీని జవ్వనపు మదము
పులకజొంపములచేఁ బొరలెక్కె మేను

చ. 2:

వడదాఁకెఁగదె దీని వాల్‌ గన్నుఁగొనలు
చిడుముడి ముచ్చటతో సిగ్గువడీని
బడిదప్పెఁ గదె దీని పలుకుఁదేనియలు
తడఁబాటుతోడ చిత్తము దాఁచెనిపుడు

చ. 3:

కసరెక్కెఁగదె దీని కస్తూరి చెమట
అసలుఁ గుంకుమ తోడ నలరీని మేన
ఉసురెక్కెఁగదె దీని యొరుపు నూరుపుల
పొసఁగి వేంకటపతి పొందు దెలిపెడిని