పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0043-6 ఆహిరి సంపుటం: 06-012

పల్లవి:

సతికి నిటువంటి రాజస మేల కలిగెనే
తతిగొన్న విరహాగ్ని ధరియించలేదు

చ. 1:

తోరమగు భారంపు తురుమేల కలిగెనే
నారీమణికి మెఱుఁగు నళినముఖికి
వైరంపు మరుని నెవ్వగల బాణాగ్నిచే
జారఁగా పలుమారు సవరించ లేదు

చ. 2:

వెలఁదికి జఘనంపుఁ వ్రేఁగేల కలిగెనే
కలహంస గమనమునఁ గదల లేదు
నలికంపు నడుము సన్నమున నవకపు మణుల
మొలనూలు జారఁగా మోవనే లేదు

చ. 3:

ఇంతికిని చక్కఁదన మింతేల కలిగెనే
వంతఁ బొరలించు యౌవన మదమున
ఇంత లోననె వేంకటేశు కౌఁగిటఁగలసి
మంతనపుఁ బరవశము మతిఁ దెలియలేదు