పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0016-03 నాట సం; 01-097 వైరాగ్య చింత


పల్లవి:
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-
నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు

చ.1:
ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక
కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు
యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-
మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు

చ.2:
యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-
కెక్కడో తనజన్మ మీ జీవుఁడు
యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పు-
డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు

చ.3:
ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనక-
కెన్నిదనువులు మోవఁడీ జీవుఁడు
యెన్నఁగల తిరువేంకటేశు మాయలఁ దగిలి
యెన్నిపదవులఁబొందఁ డీజీవుడు