పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0016-02 బౌళి సం; 01-096 వైరాగ్య చింత


పల్లవి:
చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి
చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు

చ.1:
ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపు
కడలేని యాస చీఁకటి దవ్వుకొనుట
నిడివైన కనుచూపు నీడనుండిన యెండ
వడిచెడని తమకంబు వట్టితాపంబు

చ.2:
బుద్ధిమానిన చింత పోనియూరికిఁ దెరువు
పొద్దువోవని వలపు పొట్టపొంకంబు
యెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము
లొద్దిక విహారంబు లుబ్బుఁగవణంబు

చ.3:
తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని-
చూపు దనుఁ బొడగనని చూపు లోచూపు ,
ఆపదలువాయు నెయ్యపుఁ దలఁపులీతలఁపు
రూపైన రుచిలోని రుచి వివేకంబు