పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0౦16-౦04 సామంతం సం; 01-౦98 వైరాగ్య చింత

పల్లవి:
ఎంత చేసిన తనకేది తుద
చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు

చ.1:
ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ
గడమే కాకిఁక గడ యేది
తడఁబడ హరియే దైవమనుచును మది
విడువక వుండిన వెరవే చాలు

చ.2:
యెన్నితపము లివి యెట్లఁ జేసినా
అన్నువ కథికము కలవేది
వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు

చ.3:
యిందరివాదము లెట్ల గెలిచినా
కందే గాకిఁక గరిమేది
ఇందరినేలిన యీ వేంకటపతి
పొందగు మహిమల పొడవే చాలు