పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0015-03 సామంతం సం: 01-091 వైష్ణవ భక్తి


పల్లవి :

నాఁటికి నాఁడే నా చదువు
మాటలాడుచును మఱచేటి చదువు


చ. 1:

ఎనయ నీతని నెఱుఁగుటకే పో
వెనకవారు చదివినచదువు
మనసున నీతని మఱచుటకే పో
పనివడి యిప్పటిప్రౌఢలచదువు


చ. 2:

తెలిసి యితనినే తెలియుటకే పో
తొలుతఁ గృతయుగాదులచదువు
కలిగినయీతనిఁ గాదననే పో
కలియుగంబులోఁ గలిగినచదువు


చ. 3:

పరమని వేంకటపతిఁ గనుటకే పో
దొరలగు బ్రహ్మాదులచదువు
సిరుల నితని మఱచెడికొరకే పో
విరసపుజీవులవిద్యలచదువు