పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0015-04 నాట సం: 01-092 ఉత్సవ కీర్తనలు


పల్లవి: ఇటు గరుడని నీవెక్కినను
పటపట దిక్కులు బగ్గనఁ బగిలె

చ.1: ఎగసిన గరుడని యేపున 'ధా' యని
జిగిదొలఁక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమ సంఘములు
గగనము జగములు గడగడ వడఁకె

చ.2: బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిరదిరఁ దిరిగె

చ.3: పల్లించిన నీ పసిఁడి గరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితి నీ మహిమ
వెల్లి మునుఁగుదురు వేంకటరమణా