పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0015-02 ఆహిరి సం: 01-090 వైరాగ్య చింత


పల్లవి:
అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
కుక్కనోరికళాసమై కొల్లఁబోయ బతుకు

చ.1:
ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్లానే
బండుబండై యెందుఁ గడపల గానక
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక
వండఁ దరిగినకూరవలెనాయ బతుకు

చ.2:
పంచమహపాతకాలబారిఁ బడి భవములఁ
దెంచి తెంచి ముడివేయ దీదీపులై
పొంచినయాసలవెంటఁ బొరలఁబోయెద మింక
దంచనున్న రోలిపిండితలఁపాయ బతుకు

చ.3:
యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని-
బాదచేత మేలెల్ల బట్టబయలై
గాదిలివేంకటపతిఁ గానఁగఁబోయెద మింక
బీదగరచినబూరెప్రియమాయ బ్రదుకు