పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0015-01 ఆహిరి సం: 01-089 వైరాగ్య చింత


పల్లవి:
ఊరికిఁ బోయెడి వోతఁడ కడు-
చేరువతెరు వేఁగి చెలఁగుమీ

చ.1:
ఎడమతెరువువంక కేఁగిన దొంగలు
తొడిఁబడ గోకలు దోఁచేరు
కుడితెరువున కేఁగి కొట్టువడక మంచి-
నడిమితెరువుననే నడవుమీ

చ.2:
అడ్డపుఁ దెరువుల నటునిటుఁ జుట్టాలు
వెడ్డువెట్టుచు నిన్ను వేఁచేరు
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక
దొడ్డతెరువువంక తొలఁగుమీ

చ.3:
కొండతెరువు కేఁగి కొంచపుసుఖముల
బండై తిరుగుచు బడలేవు
అండనుండెడిపరమాత్ముని తిరుమల-
కొండతెరువు తేఁకువ నేఁగుమీ