పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0010-05 కన్నడ గౌళ సం: 01-065 వైరాగ్య చింత
పల్లవి: తనకర్మవశం బించుక,దైవకృతం బొకయించుక
మనసు వికారం బించుక,మానదు ప్రాణులకు
చ. 1: ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు
యీదురవస్థలు గతులును యీలంపటములును
యీదాహము లీదేహము లీయను బంధంబులు మరి
యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు
చ. 2: యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు-
నీచొక్కులు నీపొక్కులు నీ వెడయలుకలును
యీచెలుములు నీబలువులు నీచనవులు నీఘనతలు-
నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు
చ. 3: యీవెరవులు నీయెరుకవులు యీతలఁపులు నీతెలువులు
దైవశిఖామణి తిరుమల దేవునిమన్ననలు
దైవికమున కిటువగనక తనతలఁ పగ్గలమైనను
దైవము తానౌ తానే దైవంబవుఁగాన