పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0010-04 శ్రీరాగం సం: 01-064 అధ్యాత్మ
పల్లవి: ఈ విశ్వాసంబు యెవ్వరికిఁ దోఁప దిది
పావనుల హృదయమునఁ బ్రభవించుఁగానిని
చ. 1: ఇమ్మయినపాపంబు లెన్నివలసినఁ బ్రాణి
సమ్మతంబున జేయఁ జాలుఁగా కేమి
కుమ్మరికి నొకయేఁడు గుదియ కొకనాఁడవును
నమ్మితలఁ చినవిష్ణునామంబుచేత
చ. 2: కొదలేనిదురితములు కొండలునుఁ గోట్లును
చెదర కెప్పుడుఁ బ్రాణి చేయుగా కేమి
పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను
హృదయంబు హరిమీఁద నుండినంతటను
చ. 3: సరిలేని దుష్కర్మసంఘములు రాసులై
పెరుగఁ జేయుచు ప్రాణి పెంచుఁగాకేమి?
బెరసి కొండలమీఁదఁ బిడుగువడ్డట్లౌను
తిరువేంకటాచలాధిపునిఁ దలఁచినను