పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0010-06 శ్రీరాగం సం: 01-066 దశావతారములు
పల్లవి: ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది
చ. 1: ఈ పాదమేకదా ఇందరును మొక్కెడిది
యీ పాదమే కదా యీగగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటాకి నెక్కుడైనది
చ. 2: యీ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
యీ పాదమే కదా యీబ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మండమంటినది
చ. 3: యీ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా ఇల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీవేంకటాద్రిపై నిరవైనది