పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0010-02 సామంతం సం: 01-062 భగవద్గీత కీర్తనలు
పల్లవి: ఎంత చదివిన నేమి వినిన తన-
చింత యేల మాను సిరులేల కలుగు
చ. 1: ఇతర దూషణములు యెడసినఁగాక
అతికాముకుఁడుగాని యప్పుడు గాక
మతిచంచలము గొంత మానినఁగాక
గతి యేల కలుగు దుర్గతులేల మాను
చ. 2: పరధనములయాస పాసినఁగాక
అరిదినిందలులేనియప్పుడు గాక
విరసవర్తనము విడిచినఁగాక
పరమేల కలుగు నాపదలేల మాను
చ. 3: వేంకటపతి నాత్మ వెదకినఁగాక
కింక మనసునఁ దొలఁగినఁగాక
బొంకుమాట లెడసిపోయినఁగాక
శంకయాల మాను జయమేల కలుగు