పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0100-02 పాడి సం: 01-502 భక్తి

పల్లవి:
    ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే
వదలక హరిదాసవర్గమైనవారికి
    
చ. 1:
    ముంచిననారాయణమూర్తులే యీజగమెల్ల
అంచితనామములే యీయక్షరాలెల్లా
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా
తెంచివేసి మేలు దాఁ దెలిసేటివారికి
    
చ. 2:
    చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే
భారపుయీ భూమెత నీపాదరేణువే
సారపుఁగర్మములు కేశవుని కైంకర్యములే
ధీరులై వివేకించి తెలిసేటివారికి
    
చ. 3:
    చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుఁడే
హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే
మత్తిలి యీతనికంటే మరి లే దితరములు
తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి