పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0100-03 లలిత సం: 01-503 కృస్ణ

పల్లవి:
    ఏల మోసపోయిరొకో యెంచి కాలపువారు
బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా
    
చ.1:
    పనులఁగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను
దెసల దేవుఁడేయని తెలియవద్దా
సిసువు గోవర్ధనాద్రి చేతఁ బట్టి యెత్తెనంటే
కొస రీతనిపాదాలే కొలువవద్దా
    
చ.2:
    నరునికి విశ్వరూపున్నతిఁ జూపెనంటేను
నరహరి యితఁడని నమ్మవద్దా
పరగఁ జక్రముచేత బాణుని నఱకెనంటే
సొరి దీతని శరణుచొఱవద్దా
    
చ.3:
    అందరుసురలలోన నగ్రపూజ గొన్నప్పుడే
చెంది యీతనికృపకుఁ జేరవద్దా
అంది శ్రీవేంకటేశుఁ డట్టె ద్రిష్టదైవమంటే
విందులఁ బరులసేవ విడువవద్దా