పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0100-01 శంకరాభరణం సం: 01-501 శరణాగతి

పల్లవి:
    శతాపరాధములు సహస్రదండన లేదు
గతి నీవని వుండగ కావకుండరాదు
    
చ. 1:
    తలచి నీకు మొక్కఁగా దయఁజూడకుండరాదు
కొలిచి బంటననఁగా కోపించరాదు
నిలిచి భయస్తుఁడనై నీయెదుట దైన్యమే
పలుకఁగఁ గావకుండఁ బాడిగాదు నీకు
    
చ. 2:
    శరణు చొరఁగ నీకు సారె నాజ్ఞ వెట్టరాదు
సరిఁ బూరి గరవఁగ చంపరాదు
అరయ జగద్రోహినౌదు నైనా నీనామము
గరిమె నుచ్చరించఁగఁ గరఁగక పోదు
    
చ. 3:
    దిక్కు నీవని నమ్మఁగా దిగవిడువఁగరాదు
యెక్కువ నీలెంకఁగాఁగా యేమనరాదు
తక్కక శ్రీవేంకటేశ తప్పులెల్లాఁ జేసి వచ్చి
యిక్కడ నీదాసినైతి నింకఁదోయరాదు