పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0098-04 సామంతం సం: 01-492 వైరాగ్య చింత


పల్లవి: ఇహమునుఁ బరమును యిందే వున్నవి
వహికెక్కఁ దెలియువారలు లేరు
    
చ. 1:
    చట్టువంటి దీచంచలపు మనసు
కొట్టులఁబడేది గుఱిగాదు
దిట్ట వొరులు బోధించినఁ గరఁగదు
పట్టఁబోయితే పసలేదు
    
చ. 2:
    చిగురువంటి దీజీవశరీరము
తగుళ్లు పెక్కులు తతి లేదు
తెగనిలంపటమే దినమునుఁ బెనచును
మొగము గల దిదే మొనయును లేదు
    
చ. 3:
గనివంటిది యీఘనసంసారము
తనిసితన్పినాఁ దగ లేదు
ఘనుడఁగు శ్రీవేంకటపతి గావఁగ
కొనమొద లేర్పడె కొంకే లేదు