పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0098-05 సాళంగం సం: 01-493 అంత్యప్రాస

పల్లవి:
    నేరిచిబ్రదికేవారు నీదాసులు
నేరమిఁ బాసినవారు నీదాసులు
    
చ. 1:
    కామముఁ గ్రోధము రెంటీఁ గాదని విడిచి మంచి-
నేమము వట్టినవారే నీదాసులు
దోమటి బాపపుణ్యాలఁ దుంచివేసి చూడగాఁనే
నీమాయ గెలిచినారు నీదాసులు
    
చ. 2:
    కిక్కిరించిన యాసలఁ గిందవేసి మోక్షము
నిక్కి నిక్కి చూచేవారు నీదాసులు
వెక్కసపు భక్తితోడ వెఱపు మఱపు లేక
నెక్కొన్న మహిమవారు నీదాసులు
    
చ. 3:
    అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి
నెట్టుకొని మించినారు నీదాసులు
యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా
నెట్టువడఁ దోసినారు నీదాసులు