పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0098-03 గుజ్జరి సం: 01-491 వైరాగ్య చింత


పల్లవి: సంసారినై ననాకు సహజమే
కంసారి నే నిందుకెల్లా గాదని వగవను
    
చ. 1:
    నరుఁడనైననాకు నానాసుఖదుఃఖములు
సరి ననుభవించేది సహజమే
హరిని శరణాగతులైనమీఁద బరాభవ-
మరయ నిన్నంటునని అందుకే లోగేను
    
చ. 2:
    పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాఁడ
జట్టిగాఁ గట్టువడుట సహజమే
యిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాట
పట్టు వోయీనోయని పంకించే నే నిపుడు
    
చ. 3:
మాయకులోనైననాకు మత్తుఁడనై యిన్నాళ్లు
చాయకు రానిదెల్లా సహజమే
యీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవు
మోయరానినేను నీకు మోపని వీఁగేను