పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: ౦090-04 బౌళి సం: 01-480 దశావతారములు


పల్లవి:
అరుదరుదు నీమాయ హరి హరీ
అరసి తెలియరాదు హరిహరీ

చ.1:
అనంతబ్రహ్మండము లవె రోమకూపముల
అనంతములై వున్నవి హరిహరీ
పొనిగి కుంగినవొక్క భూమి నీ వెత్తినది యే-
మని నుతింతు నిన్ను హరి హరీ

చ.2:
పొదిగి బ్రహ్మదులు నీబొడ్డును నేకాలము
అదివో పుట్టుచున్నారు హరిహరి
పొదలి యీజీవులను పుట్టించే యీసామర్ధ్యము
అదన నేమనిచెప్పే హరి హరీ

చ.3:
పావనవైకుంఠము నీపాదమూల మందున్నది
ఆవహించేభక్తిచేత హరి హరీ
శ్రీవేంకటాద్రిమీఁద చేరి నీ విట్టె వుండఁగా-
నావల వెదకనేల హరిహరీ