పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0096-03 ముఖారి సం; 01-479 వైష్ణవ భక్తి


పల్లవి:
కంటే సులభ మిది కానక యుంటే దుర్లభ:
మింటిలోననే వున్న దిహముఁ బరమును

చ.1:
హరిదాసులు మెట్టినక్కడే పరమపద-
మరయ నిందుకంటె నవల లేదు
తిరమై వీరి పాదతీర్థమే విరజానది
సొరిది నన్ని చోట్లు చూచినట్టే వున్నది

చ.2:
మిచ్చక వైష్ణవుల మాటలెల్లా వేదములు
యిచ్చల నిందుకంటే నింక లేదు
అచ్చట వీరిప్రసా ద మమృతపానములు
అచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది

చ.3:
చెలఁగి ప్రపన్నుల సేవే విజ్ఞానము
ఫల మిందుకంటే మఱి పైపై లేదు
తలఁప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపు-
లెలమి నెదుట నున్నా రెఱిఁగినవారికి