పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: ౦౦92-౦4 ముఖారిసం: 01-456 అధ్యాత్మ


పల్లవి:
అక్కరకొదగనియట్టియర్థము
లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే

చ.1:
దండితోఁ దనకుఁ గాని ధరణిశు రాజ్యంబు
యెండెనేమి యది పండెనేమిరే
బెండుపడఁ గేశవునిఁ బేరుకొననినాలికె
వుండెనేమి వుండకుండెనేమిరే

చ.2:
యెదిరిఁ దన్నుఁ గానని యెడపుల గుడ్డికన్ను
మొదలఁ దెఱచెనేమి మూసెనేమిరే
వెదకి శ్రీపతిసేవ వేడుకఁ జేయనివాఁడు
చదివెనేమి చదువు చాలించెనేమిరే

చ.3:
ఆవల నెవ్వరులేనిఆడవిలోనివెన్నెల
కావిరిఁ గాసెనేమి కాయకున్న నేమిరే
శ్రీవేంకటేశ్వరుఁ జేరనిధర్మములెల్ల
తోవల నుండెనేమి తొలఁగినేమిరే