పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0092-03 అలిత సం: 01-455 వేంకటగానం


పల్లవి:
నీ వేలికవు మాకు నీదాసులము నేము
ఆవల నితరుల నే మడుగఁబొయ్యేమా

చ.1:
పసురమై వుండి యిచ్చీఁ బక్కన గామధేనువు
యెసఁగి మానై వుండి యిచ్చీఁ గల్పవృక్షము
వెస రాయైవుండి యిచ్చీ వేడుకఁ జింతామణి
మసలనిశ్రీపతివి మాకు నిచ్చే దరుదా

చ.2:
గాలి యావటించి యిచ్చీఁ గారుమేఘము మింట
వీలి జీర్ణమై యిచ్చీ విక్రమార్కునిబొంత
కాలినపెంచై వుండి కప్పెర దివ్యాన్నమిచ్చీ
మైలలేనిశ్రీపతివి మాకు నిచ్చు టరుదా

చ.3:
అండనే కామధేనువ వాశ్రితచింతామణివి
పైండినకల్పకమపు భక్తులకెల్లా
నిండిన శ్రీవేంకటేశ నీవు మమ్ము నేలితివి
దండిగా నమ్మితే నీవు దయఁజూచు టరుదా