పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రెకు: 0092-02 శంకరాభరణం సం: 01-454 దశావతారములు


పల్లవి:
అంగనలాల మనచే నాడించుకొనెఁగాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే

చ.1:
వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁగాని
తడయక పురుషాత్తముఁ డితఁడే
బడబాగ్ని జలధికిఁ బాయకల్లుఁడాయఁగాని
వెడలించె నమృతము విష్ణుఁ డితడే

చ.2:
పులిగూడుదిన్న వానిపాం దొక్కటే సేసేఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁగాని
పలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే

చ.3:
యెక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁగాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁగాని
తక్కక వేదము చెప్పే దైవమీతఁడే