పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0090-04 గుజ్జరి సం: 01-444 వైష్ణవ భక్తి


పల్లవి:
ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము
శ్రీతరుణీపతి మాయాధవుఁడు సృష్టియింతయును హరిమూలము

చ.1:
కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁదామే
ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేల
సారేకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి
కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము

చ.2:
కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము అందుకది
యిమ్ముల మోక్షము యీరితులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు
కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదననవుననరాదెవ్వరికి
సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము

చ.3:
సరి నెఱఁగుదుమూ పోయినజన్మము సారేకు నేమేమిచేసితిమా
యిరవుగ నట్లా మీదఁటిజన్మముయెఱుకలు మఱపులు యిఁకనేలా
నిరతమై శ్రీవేంకటేశుఁడు తనయిచ్చ నిర్మించిన దిదియీదేహము
గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి