పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0090-03 సామంతం సం: 01-443 నృసింహ


పల్లవి:
కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి
నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు

చ.1;
మేఁటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు
గాఁటపువిజ్ఞానముకంటే సుఖము లేదు
మీఁటైనగురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడు
బాటసంసారముకంటే పగ లేదు

చ.2:
పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదు
పరోపకారముకంటే బహుపుణ్యము లేదు
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు
హరిదాసుడౌకంటే నట గతి లేదు

చ.3:
కర్మసంగము మానుకంటే దేజము లేదు
అర్మిలిఁ గోరకమానేయంతకంటే బుద్ధి లేదు
ధర్మపుశ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చి
నిర్మలాన నుండుకంటే నిశ్చయము లేదు