పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0090-05 గుజ్జరి సం: 01-445 అధ్యాత్మ


పల్లవి:
దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు
శ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే

చ.1:
జనని నీమాయా జనకుఁడవు నీవు
జనులము నేమిందర మొకసంతతిబిడ్డలము
వొనరెడి దినభోగములు వూరేటిచనుబాలు
మునుకొను మానడవళ్లివి ముద్దులు మీ కివివో

చ.2:
ధర బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులు
వురుటగు మాదేహంబులు వుయ్యలతొట్టెలలు
మరిగినసంసారము బొమ్మరిండ్లయాట లివి
నిరతి మాయజ్ఞానంబు నీకు నవ్వులయ్యా

చ.3:
చావులుఁ బుట్టుగు లాడెడిసరి దాగిలిముచ్చిములు
భావపుటారంభంబులు బాలలీలగతులు
కైవశమందఁగ శ్రీవేంకటపతి నీదాస్యం బిది
మావంటివారికెల్లను నీమన్ననలాలనలు