పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రెకు: ౦౦89-06 బౌళి సం; 01-440 అధ్యాత్మ


పల్లవి:
పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి పట్టుబుద్దెఱిఁగితే
మరులు మఱచితేనే యిన్నిటి గెలిచే మర్మము సుండీ జ్ఞానులకు

చ.1:
జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారి
తనరఁ గౌపీన కటిసూత్రముల తగులములేని దిగంబరి
తనుఁదా నెఱఁగడుయెదిరినెఱఁగఁడు తత్వధ్యానాలయనిర్మలచిత్తుఁడు
పెనఁగేకోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీడువోయమ్మా

చ.2:
నిద్దురవొయ్యేటి యప్పుడుదేహి నిత్యవిరక్తునివంటిఘనుఁడు
బుద్ది సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లఁడు
వొద్దనే యేపనులకుఁ జేయఁబోఁడు వున్నలంపటాల కేమియుఁ జొరఁడు
కొద్దిలేనియాస యెందువోయనాకో కోపమేమి లేదు వీఁడివో యమ్మా

చ.3:
హరి శరణన్న యప్పుడు దేహి అమరులకంటే కడునధికుఁడు
పరమునిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు
దురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా వచ్చు
గరిమ శ్రీవేంకటేశుఁడు వీఁడివో కానరైరిగా యిన్నాళ్లమ్మా