పుట:తాళ్ళపాక పదసాహిత్యం ౧.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: ౦౦9౦-౦1 సాళంగం సం; 01-441 భక్తి


పల్లవి:
ఉన్నవిచారములేల వోవో సంసారులాల
యిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో

చ.1:
తక్కక బ్రహ్మలఁగన్న తండ్రిఁ గొలిచి మీరు
యెక్కువ సంతతిగల్గి యీడేరరో
అక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరు
చొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో

చ.2:
భవరోగవైద్యుని పాదములు సేవించి
భువి రోగములఁ బాసి పొదలరో
తవిలి పదిదిక్కులు తానైన వానిఁ
గవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో

చ.3:
తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడే
యెల్లగాఁ బుట్టించి పెంచేయేలి కీతఁడే
చల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేము
కొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో